సుప్రీంలో కూడా అజారుద్దీన్‌కు చుక్కెదురు

-

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సీఏ ఓటర్ జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని అజారుద్దీన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఓటర్ జాబితా వచ్చేసిందని, ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ఏకసభ్య కమిటి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపింది. అనంతరం విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది.

కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version