కరోనా సమయంలో ఏపీకి రావాలంటే భయం అడ్డొచ్చింది… విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషయంలో పరామర్శలకు వెళ్దామంటే జగన్ ను అనుమతి అడగడానికి అభిజాత్యం అడ్డొచ్చింది… మోడీని అనుమతి అడిగితే అటునుంచి స్పందన కరువైంది… నిన్న గుంటూరు వెళ్లి అచ్చెన్నను కలుద్దామంటే జైళ్ల శాఖ అడ్డుచెప్పింది… నేడు కడపకు వెళ్దామంటే అక్కడనుంచీ నిరాకరణే ఎదురొచ్చింది! ఫలితంగా కాగడాలు పట్టుకోనున్నారు టీడీపీ నేతలు!
అవును… గుంటూరులో జైళ్ల శాఖకు ఒక రూలు, కడపలో జైళ్ల శాఖాధికారులకు మరో రూలూ ఉంటాయా? మాజీ మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ కు ఆమాత్రం ఆలోచన లేకుండా పోయిందా? అని వస్తున్న ప్రశ్నల సంగతి అటుంచితే… అన్ని జిల్లాల్లోనూ ఒకటే రూల్ ఉంటుందని, జిల్లాలను బట్టి జైళ్ల శాఖ రూల్స్ మారవని తేలిపోయింది. గుంటూరులో అచ్చెన్నను కలవడానికి వెళ్లినప్పుడు… గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు… మీకు కూడా ఇవ్వలేమని మర్యాదగా చెప్పి పంపించేశారు పోలీసులు.
అప్పటికైనా అర్ధం చేసుకోకుండా… కడపకు వెళ్తానని ప్రకటించారు నారా లోకేష్! కడప కూడా ఏపీలో భాగమేనని చెప్పకనే చెప్పిన జైళ్ల శాఖాధికారులు… కరోనా కారణంగా ములాఖత్ కు అనుమతి లేదని తేల్చి చెప్పేశారు! దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని కలవాలనుకున్న లోకేష్ ఆశ నిరాశైంది! అదే కారణమో లేక ఏదో ఒక కార్యం చేయాలనే సంకల్పమో తెలియదు కానీ… అరెస్టులకు నిరసనగా ఈ రోజు రాత్రి ఏడుగంటలకు ఎవరి ఇళ్లముందు వారు కాగడాల ప్రదర్శన చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు టీడీపి అధినేత చంద్రబాబు! ఇందులో భాగంగా వారు కూడా ఉండవల్లి లోని తమ నివాసం దగ్గర కాగడాలతో నిరసన తెలపనున్నారు!