దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్డిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఒక్కొక్కరికి 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి నోటీసు జారీ చేసింది. బెయిల్ పొందిన వారిలో ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, వ్యాపారవేత్త సమీర్ మహేంద్రులు ఉన్నారు.
ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌కు ఇదివరకే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 25న మద్యం కేసులో దాదాపు 10 వేల పేజీలతో తొలి చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీబీఐ.. ఏడుగురు నిందితుల పేర్లను చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్‌దీప్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్ పేర్లను చార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొంది. నిందితులకు బెయిల్ మంజూరు అనంతరం… తదుపరి విచారణ జనవరి 24కు సీబీఐ ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.