ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి నేతలు క్యూ కడుతున్నారు. యువనేతలు మాజీ మంత్రులు ఇలా ఒక్కొక్కరు పార్టీ మారడానికి సిద్దమయ్యారు. తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన కొందరు యువ నేతలు ఇప్పుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. జగన్ సమక్షంలో పది మంది మాజీ మంత్రులు పార్టీ మారడానికి సిద్దమయ్యారు.
తాజాగా నందమూరి బాలకృష్ణ స్నేహితుడు ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత కదిరి బాబూరావు టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్దమయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రకాశం జిల్లా దర్శి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ఎంపీ గా పోటీ చేయడంతో ఆయన ఎమ్మెల్యే గా అక్కడి నుంచి పోటీ చేసారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు చంద్రబాబు.
వాస్తవానికి ఆ నియోజకవర్గం నుంచి ఒక కీలక నేతకు ఇవ్వాల్సి ఉన్నా బాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. దర్శి లో బాబురావు కి సీటు ఇస్తే తాను గెలిపిస్తా అన్నారు. అయితే అప్పటికి టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలో ఈయన ఓటమి పాలయ్యారు. కాని ఈయనకు నియోజకవర్గంలో బలమైన వర్గం ఉంది. దీనితో బాలకృష్ణ కూడా పట్టుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో ఆయన పార్టీ మారడం ఇప్పుడు షాకింగ్ గా మారింది.