మున్సిపల్ ఎన్నికల్లో బాలయ్య ప్రభావం పై టీడీపీలో ఆసక్తికర చర్చ

-

బాలయ్య వెండితెరపై హీరోనే కాదు పొలిటికల్‌ స్క్రీన్‌పై ఎమ్మెల్యే కూడా. ఇటీవల ముగిసిన పల్లెపోరులో ఆయన ఎంట్రీ ఇచ్చినా హిందూరంలో ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు పార్టీ సింబల్‌పై జరిగే మున్సిపల్‌ ఎన్నికలొచ్చాయి. దీంతో హిందూపూర్ మున్సిపల్ ఎన్నికలలో బాలయ్య ప్రభావం పై టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

పంచాయతీ ఎన్నికల్లో ఏపీలో ఎలా ఉన్నా.. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి ఎదురే ఉండదని భావించాయి టీడీపీ శ్రేణులు. ఎమ్మెల్యే బాలయ్య ఫీల్డ్‌లోకి దిగితే ఆ సీనే వేరని లెక్కలేసుకున్నాయి. కానీ.. ఆ పప్పులేమీ ఉడకలేదు. బాలకృష్ణ స్వయంగా ప్రచారం చేసినా పల్లెల్లో వైసీపీనే పాగా వేసింది. రెండు రోజులపాటు టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఏకగ్రీవాలను అడ్డుకున్నారు కానీ… పోలింగ్‌ రోజు చతికలపడ్డారు. ఫలితంగా నియోజకవర్గంలోని 38 పంచాయతీలలో 8 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలిచారు. బాలయ్య ఊపు చూసి సగానికిపైగా స్థానాల్లో సైకిల్‌ సత్తా చాటుతుందని అనుకున్నా సాధ్యం కాలేదు.

ఇప్పుడు పార్టీ సింబల్‌పై జరిగే మున్సిపల్‌ ఎన్నికలొచ్చాయి. కిందటిసారి జరిగిన హిందూపురం మున్సిపల్‌ ఎన్నికల్లో ఇక్కడ 38 వార్డుల్లో టీడీపీ, వైసీపీ చెరో 19చోట్ల గెలిచాయి. చివరకు ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఎక్స్‌అఫీషియో ఓట్ల సాయంతో టీడీపీ చైర్మన్‌ పీఠం కైవశం చేసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. పంచాయతీ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో రుచి చూపించింది. మరి.. రేపటి రోజున హిందూపురం మున్సిపాలిటీలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేష్ల ఘట్టం పూర్తయిన తర్వాత బాలకృష్ణ హిందూపురం వచ్చారు. తర్వాత హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచే గైడ్‌ చేశారు. ఇప్పుడు బాలయ్య కంటే ముందుగానే హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ ప్రచారం ఊదరగొట్టేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల మాదిరే పల్లెపోరులో హిందూపురం చరిత్ర తిరగరాస్తుందని భావించిన తమ్ముళ్ల లెక్క తప్పింది. వెండి తెరపై డైలాగులు బాగుంటాయి కానీ.. బాలయ్య వచ్చినా రికార్డుల మోత లేదని పార్టీ కేడర్‌ గుసగుసలాడుకుంటోంది. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ అలాగే చేస్తారా లేక దగ్గరుండి పార్టీకి గెలుపు వ్యూహం రచిస్తారా లెక్కలేసుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Latest news