పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరగబోయే సింగరేణి మహా ధర్నా ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెపట్టే మహధర్నా నిరసన సెగ ప్రధాని మోదీ తాకాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై మరోమారు జంగ్ సైరన్ పూరించనున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం మాత్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తీసుకువచ్చిందన్నారు. అటు సింగరేణి కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు సైతం ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరుతున్నా పట్టించుకోలేదన్నారు.
మరోసారి సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ పల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. మార్చి 29 నుంచి మే 30 వరకు గనుల వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా బొగ్గు గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని.. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమని మంత్రి అన్నారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్ఎస్ తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున, సింగరేణి కార్మికుల పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామన్నారు.