వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లు గెలిచి అధికారంలోకి రావడమే టార్గెట్ గా పెట్టుకుని బీజేపీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నాయకులని రెడీ చేయని బీజేపీ..తాజాగా 119 స్థానాల్లో నాయకులని రెడీ చేసింది. అలాగే 119 స్థానాల్లో ఇంచార్జ్‌లతో పాటు..ఆ స్థానాల్లో గెలిపించే బాధ్యతలని పాలక్‌లకు అప్పగించారు.
ఇలా అన్నీ రెడీ చేసుకుని..10 నెలలు టార్గెట్‌గా పెట్టుకుని..ఈ 10 నెలల్లో పార్టీ బలం పెరగడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మిషన్-90 పేరుతో ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. జనవరి 16 నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేసి..రోజుకు 2,3 నియోజకవర్గాలు తిరగనున్నారు. ఇక ఇతర నేతలు కూడా తమకు కేటాయించిన బాధ్యతల ప్రకారం నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. జనవరి నుంచి 10 వేల సభలు నిర్వహించనున్నట్లు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు
ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక గ్రామ, మండల స్థాయిలో కూడా సభలు పెట్టనున్నారు. ఇక ఏప్రిల్‌లో ప్రభుత్వంపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామని, మిషన్ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో 90 అసెంబ్లీ స్థానాలు, దేశంలో 400 పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ రూట్‌మ్యాప్ సిద్దమైందని లక్ష్మణ్ చెప్పారు.
తెలంగాణలో మాత్రం పక్కాగా 90 స్థానాలు గెలవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది..ఇక వరుసపెట్టి నియోజకవర్గాల్లో తిరగనున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. ఒకవేళ ముందస్తు జరిగినా..దానికి సిద్ధమయ్యేలా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది.