కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. ఎప్పటికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ కి మీడియా ఫోబియా పట్టుకుందని.. ఎప్పుడూ న్యూస్ లో, సోషల్ మీడియాలో కనిపించాలనే తపన తప్ప మరేదానికి కేటీఆర్ పనికిరాడని విమర్శించారు. అమృత్ పథకంలో అక్రమాలపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై స్పందించారు.
అక్రమాలపై ఆరోపణలు చేసే బదులు ఫిర్యాదు చేస్తే.. కేంద్రం విచారిస్తుంది కదా అని ప్రశ్నించారు. హైడ్రాకు తాము వ్యతిరేకం కాదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నాయకుల ప్రోత్సాహంతోనే కబ్జాలు జరిగాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలకు కారణమైన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తిరుపతి లడ్డూపై కూడా స్పందించారు. తిరుపతి లడ్డూ కల్తీ హిందూ ధర్మం పై దాడి మాత్రమే కాదని.. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు బండి సంజయ్.