‘బండి’ లాగడానికి వారి సపోర్ట్ కావాల్సిందేనా?

-

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ(BJP) దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో ఏ మాత్రం బలం లేని బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో బాగా బలం పుంజుకుంటుంది. వరుసగా దుబ్బాక ఉపఎన్నికలో, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అలాగే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌ని బీజేపీలోకి తీసుకుని, హుజూరాబాద్‌లో సత్తా చాటుతామని బీజేపీ చెబుతోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టి అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.

బీజేపీ/ BJP

కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో బీజేపీకి ఆ పరిస్తితి ఉందా? రాష్ట్ర స్థాయిలో బీజేపీకి అంత బలం ఉందా? అంటే చెప్పడం కాస్త కష్టమే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్..పార్టీని బలోపేతం చేయడానికి బాగానే కష్టపడుతున్నారు. గత అధ్యక్షులు కంటే దూకుడుగా అధికార పార్టీపై పోరాడుతున్నారు. ఆ దూకుడే బీజేపీకి ప్లస్ అవుతుంది. ఇటీవల బీజేపీకి వస్తున్న విజయాల్లో అధ్యక్షుడుగా బండి పాత్ర చాలానే ఉంది.

కానీ ఈ విజయాలు బండికి సరిపోతాయా? కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే బండి ఇంకెంత కష్టపడాలి. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి దూకుడుని అడ్డుకోవాలంటే ఏం చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో రాష్ట్రంలో బీజేపీలో బలమైన నాయకులు ఉన్నారు. కానీ బలమైన కేడర్ లేదు. బీజేపీకి ఇంతవరకు వచ్చిన విజయాలు బలమైన నాయకత్వం వల్లే వచ్చాయి. కానీ బలమైన కేడర్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సత్తా చాటడం చాలా కష్టం.

ముందు బండి క్షేత్ర స్థాయిలో కేడర్‌ని తయారుచెయ్యాలి. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకుడుకు పగ్గాలు అప్పగించి, కార్యకర్తల బలం పెంచుకోవాలి. అలా కాకుండా వేరే పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని తీసుకోస్తూ, రాజకీయాలు చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి బీజేపీ బండి లాగాలంటే ముందుగా కేడర్‌ని బలోపేతం చేయాలి. మరి సంజయ్ ఆ విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version