వీడియో.. దొంగలనుకుని సాధువులను కొట్టి కొట్టి చంపేసారు..!

-

విచక్షణ కోల్పోయిన గ్రామస్థులు, ఎంత చెప్పినా వినకుండా కర్రలతో చావబాది, ఇద్దరు సాధువులను వారితోపాటు ఉన్న మరో వ్యక్తిని దారుణంగా అంతమొందించారు. అడ్డమొచ్చిన పోలీసులను కూడా చితకబాదారు.

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి ముంబయిలో జరిగింది. ముంబయికి 125 కి.మీల దూరంలో ఉన్న పాల్ఘర్‌ జిల్లా, గంద్‌చించల్‌ అనే గ్రామంలో ఈనెల 16న ముగ్గురు వ్యక్తులను గ్రామస్థులు చితకబాది చంపేసారు. అందులో ఇద్దరు అఖాడా సాధువులు ఉన్నారు. ఇంకా ఘోరమేమిటంటే, మూడు రోజుల వరకు ఈ దారుణం వెలుగుచూడకపోవడం. నిన్న ఆ ఘోరానికి సంబంధించిన విడియోలు సోషల్‌ మీడియాలో కనబడటంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది.

మూడు వాహనాలు కూడా ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. అందులో రెండు పోలీసు వాహనాలు కావడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసువర్గాలు హుటాహుటిన మరిన్ని పోలీసు బృందాలను పంపి గొడవ సద్దుమణిగేలా చేసారు. కాగా, జరిగిన దాడిలో చనిపోయిన మూడో వ్యక్తిని డ్రయివర్‌గా గుర్తించారు. ఆ ఇద్దరు సాధువులను మహరాజ్‌ కల్పవృక్ష గిరి (70), సుశీల్‌ గిరి మహారాజ్‌ (35), వారణాసిలోని శ్రీ పంచ దష్నామ్‌ జునా అఖాడా ఆశ్రమానికి చెందినవారుగా గుర్తించారు.

‘జునా అఖాడా’ అనేది ప్రాచీన సాధు సంప్రదాయంగా ప్రసిద్ధి పొందింది. గతేడాది ఒక దళితున్ని ‘మహామండలేశ్వర్‌’గా నియమించి వార్తల్లో నిలిచింది.
ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉన్న విడియోల్లో ఒక కాషాయ వస్త్రధారిని పోలీసు భవనంలో నుండి బయటకు తీసుకురాగా, అక్కడే వేచిచూస్తున్న గుంపు ఒక్కసారిగా ఆ వ్యక్తిపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కర్రలో, రాళ్లతో బాదడం కనిపించింది. ఆ ముసలి సాధువు ప్రాణాల కోసం ఏడుస్తూ ప్రాధేయపడుతున్నా ఆ జనం కనికరించలేదు. ఇంత జరుగుతున్నా, పోలీసులు మాత్రం ఆపడానికి ప్రయత్నించినట్లు ఆ విడియోలో కనబడలేదు.

కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే స్పందించారు. గ్రామస్థులు వారు ముగ్గురిని పిల్లల దొంగలుగా భ్రమపడి దాడికి దిగినట్లుగా తెలిసిందన్నారు. ఆ గ్రామస్థులకు అప్పటికే అక్కడ పిల్లల దొంగలు సంచరిస్తున్నట్లుగా సమాచారం ఉందని, పొరపాటున ఈ సాధువులు అటువైపు రావడంతో వారే దొంగలని భావించిన గ్రామస్థుల గుంపు దాడికి దిగిందని, చనిపోయినవారితో సహా పలువురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ దుర్ఘటనకు మతం రంగు పులమొద్దని, ఇందులో ఎటువంటి మత ఘర్షణకు ఆస్కారం లేదని స్పష్టం చేసారు.

జరిగిన ఈ సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఆరా తీసినట్లు తెలిపిన సీఎం, ఈ కేసును తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని ఆయనకు హామీ ఇచ్చానని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version