చైనాలోని వూహాన్ నగరంలో మొదటగా కరోనా వైరస్ ఉద్భవించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడి సీ ఫుడ్ మార్కెట్ ద్వారా కరోనా వ్యాపించిందని తెలుస్తోంది. అయితే చైనా మాత్రం వైరస్ తమ దగ్గర జన్మించలేదని, అమెరికాలోనే అది వ్యాప్తి చెందిందని మొదటి నుంచీ వాదిస్తూ వస్తోంది. కానీ కరోనా వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందనే విషయాన్ని మాత్రం సైంటిస్టులు కనుగొన్నారు. అయితే నిజానికి కరోనానే కాదు.. ఇతర అనేక రకాల వైరస్‌లకు గబ్బిలాలు వాహకాలుగా ఉంటాయి. వాటి వల్ల అనేక వైరస్‌లు వ్యాపిస్తాయి. మరలాంటప్పుడు గబ్బిలాలు అనారోగ్యానికి ఎందుకు గురవ్వవు ? వాటిల్లో అనేక రకాల వైరస్‌లు ఉంటాయి కదా.. అలాంటిది వాటికి వైరస్ కారణంగా వ్యాధులు ఎందుకు రావు ? అనే విషయాలపై సైంటిస్టులు తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేమిటంటే…
గబ్బిలాలు అనేక వైరస్‌లకు వాహకాలుగా ఉంటాయి. అది నిజమే. కొన్ని రకాల వైరస్‌లను అవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మోసుకెళ్తాయి. అలా అవి కొన్ని వైరస్‌లను జీవులకు వ్యాపింపజేస్తాయి. ఇక కొన్ని రకాల వైరస్‌లు గబ్బిలాల్లో ఎప్పటికీ అలాగే ఉంటాయి. అవి కాలానుగుణంగా మార్పులకు లోనవుతాయి. పరివర్తనం చెందుతాయి. దీంతో అవి కొత్త వైరస్‌లుగా మారుతాయి. ఈ క్రమంలో గబ్బిలాలు తిరిగే ప్రదేశాల్లోని జీవులకు ఆ కొత్త వైరస్‌లు వ్యాపిస్తాయి. ఇలా వైరస్‌లు గబ్బిలాల నుంచి ఇతర జీవులకు.. అక్కడి నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతాయి. అయితే మనుషులకు గబ్బిలాలంతటి పటిష్టమైన రోగ నిరోధక శక్తి ఉండదు. కనుకనే మనుషులు వైరస్‌లు వ్యాపిస్తే తట్టుకోలేరు.
కానీ గబ్బిలాలు మాత్రం అలా కాదు. ఎలాంటి వైరస్‌ను అయినా తట్టుకునే పటిష్టమైన శరీర రోగ నిరోధక వ్యవస్థ వాటికి ఉంటుంది. వైరస్‌లు వాటి శరీరంలోకి ప్రవేశించగానే నాశనం అవుతాయి. అవి వాటి శరీరంలో వృద్ధి చెందలేవు. అందుకు అనుగుణంగా గబ్బిలాలు ఎప్పటికప్పుడు వైరస్‌ల పట్ల రోగ నిరోధకతను ప్రదర్శిస్తాయి. అందువల్లే అనేక వైరస్‌లు వాటిలో ఉన్నా.. వైరస్‌లకు అవి వాహకాలుగా ఉన్నా.. వాటికి ఏమీ కాదు.
అయితే గబ్బిలాల పటిష్టమైన శరీర నిరోధక వ్యవస్థకు కారణమయ్యే జన్యువులతో సమానమైన శక్తిని కలిగి ఉండే మెడిసిన్లను అభివృద్ధి చేస్తే… అప్పుడు మనుషులు కూడా గబ్బిలాలంతటి రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారనేది సైంటిస్టుల మాట. ఈ దిశగా వారు ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అవి విజయవంతం అయిననాడు… కరోనా కాదు కదా.. దాని తాత లాంటి వైరస్ వచ్చినా మనం తట్టుకుంటాం. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. ఆ రోజు రావాలని మనం కోరుకోవాల్సిందే..!