కవిత : నాన్నెందుకో వెనుకబడ్డాడు….

-

నటుడు, రచయిత తనికెళ్ల భరణి గారు ఈ మధ్య చినజీయర్‌స్వామి పాల్గొన్న ఒక ఆధ్యాత్మిక సమావేశంలో చదివి వినిపించిన కవిత ఇది. ఆయన ఎంతో చెమ్మగిల్లిన హృదయంతో చదివారు. మీరు కూడా అంతే. ‘మనలోకం’ పాఠకులకు ప్రత్యేకం.

అమ్మ తొమ్మిదినెలలు మోస్తే, నాన్న పాతిక ఏళ్లు.

రెండూ సమానమే అయినా,

నాన్నెందుకో వెనుకబడ్డాడు.

 

ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ,

తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న,

ఇద్దరూ సమానమే అయినా,

అమ్మకంటే నాన్నెందుకో వెనుకబడ్డాడు.

 

ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ,

ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న,

ఇద్దరి ప్రేమ సమానమే అయినా, అమ్మకొచ్చిన పేరు ముందు

నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు.

 

ఫోన్లోనూ అమ్మ పేరే. దెబ్బ తగిలినప్పుడూ అమ్మా అని పిలవడమే.

అవసరమొచ్చినప్పుడు తప్ప, ఎప్పుడూ గుర్తురానందుకు

నాన్నెప్పుడైనా బాధపడ్డాడా? ఏమో..

ఇద్దరూ సమానమే అయినా,

పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా

నాన్నెందుకో వెనుకబడ్డాడు.

 

అమ్మకు, మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు.

నాన్న బట్టలకు దండెం కూడా నిండదు.

తననితాను పట్టించుకోవడం రాని నాన్న,

మాక్కూడా పట్టనంత వెనుకబడ్డాడు.

 

అమ్మకి అన్నో, కొన్నో బంగారు నగలు.

నాన్నకు బంగారు అంచు గల పట్టుపంచె ఒకటే.

కుటుంబం కోసం ఎంత చేసినా,

తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న

ఎందుకో పాపం.. బాగా వెనుకబడ్డాడు.

 

పిల్లల ఫీజులు, ఖర్చులున్నాయి అప్పుడప్పుడూ.

ఈసారి పండక్కి చీర కొనద్దంది అమ్మ.

ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే,

ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న.

ఇద్దరి ప్రేమ ఒకటే అయినా,

మా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.

 

వయసు మళ్లాక, అమ్మయితే ఇంట్లోకి పనికొస్తుంది.

నాన్న ఎందుకూ పనికిరాడని మేం తీర్మానం చేసుకున్నప్పుడు

కూడా వెనుకబడింది నాన్నే.

 

నాన్నిలా వెనుకబడిపోవడానికి కారణం,

అందరికీ వెన్నెముక కావడమే.

వెన్నెముక వెనుక ఉండబట్టే  కదా దన్నుగా నిలబడుగలుగుతున్నాం.

ఇదేనేమో! నాన్న వెనుకబడిపోవడానికి కారణం.

 

(ఈ కవిత రాసినవారికి భరణి గారు పాదాభివందనాలు చెప్పారు. మేం కూడా అంతే. )

Read more RELATED
Recommended to you

Exit mobile version