పీఎంవీవీవై స్కీంతో వృద్ధులకు పలు బెనిఫిట్స్

-

ప్రధానమంత్రి వయో వందన యోజన (పీఎంవీవీవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడేళ్లపాటు పొడిగించింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఈ స్కీంను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వృద్ధులకు నెలవారీ పింఛన్ అందజేస్తుంది. అయితే ఈ పథకంలో చేరేందుకు చివరి తేదీ 2021 మార్చి 31 వరకు ఉండగా.. కేంద్రం 2023 మార్చి 31వ తేదీ వరకు పథకంలో చేరే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ స్కీం ద్వారా నెల నెలా పింఛన్ పొందవచ్చు.

ప్రధానమంత్రి వయో వందన యోజన

ప్రముఖ బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఈ స్కీంను ప్రభుత్వం తరఫున అందజేస్తోంది. పీఎంవీవీవై స్కీం కేవలం వృద్ధులకే పరిమితం. ఈ స్కీంలో చేరాలనుకునే వారు గరిష్టంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఎల్ఐసీ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి మీ పూర్తి వివరాలను నమోదు చేస్తే సరిపోతుందని, లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. అయితే ఈ పాలసీ కాలవ్యవధి 10 సంవత్సరాలు. ఒకవేళ పాలసీదారుడు ఈ స్కీంలో చేరినట్లయితే.. 2021 మార్చి ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేసిన పాలసీలకు 7.4 శాతం వార్షిక వడ్డీ రేటు కలిస్తోందని ఎల్‌ఐసీ వెల్లడించింది. అలా వచ్చిన వడ్డీని ప్రతినెల పింఛను రూపంలో పాలసీదారులకు అందజేస్తామని ఎల్ఐసీ తెలిపింది. 2022-23 మార్చి నెల లోను ఆయా ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీరేట్లతో పింఛనుదారులకు పింఛన్ చెల్లిస్తామన్నారు.

ఈ స్కీంలో చేరాలనుకునే వారు నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ప్రాదిపదికన వడ్డీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. నెలవారీ ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే మీరు కనీసం రూ.1,62,162, త్రైమాసిక ఆప్షన్‌ ఎంచుకున్నట్లయితే రూ.1,61,074, అర్ధవార్షిక ఆప్షన్‌ రూ.1,59,574, వార్షిక ఆప్షన్‌ రూ.1,56,658 డబ్బులతో పాలసీని కొనుగోలు చేయాలి. అలా మీకు వచ్చే వడ్డీతో కనిష్టంగా రూ.1000 నుంచి రూ.9,250 వరకు నెలవారీ పింఛను పొందవచ్చు. గతంలో ప్రభుత్వం ఈ స్కీం ద్వారా 8 శాతం వడ్డీ కల్పించేది. అలా నెలకు రూ.10 వేల పింఛను కూడా అందేది. కానీ, ప్రస్తుతం 7.4 శాతం వడ్డీరేటు కల్పిస్తోంది. అయితే పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత చెల్లించిన మొత్తంపై 75 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుందని ఎల్‌ఐసీ సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version