పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీ ప్రభుత్వం, మోడీపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్‌ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని మమతా బెనర్జీ మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలతో రాష్ట్రాల వ్యవహారాల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలదూర్చుతోందని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కేంద్ర దర్యాప్తు సంస్ధలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని ఆమె పిలుపు ఇచ్చారు. రాష్ట్రాల పనితీరులో కేంద్ర ఏజెన్సీలతో జోక్యం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య వ్యవస్ధను ధ్వంసం చేస్తోందని సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడాన్ని దీదీ ప్రస్తావిస్తూ ఇది ఎన్నికల స్టంట్ అని అభివర్ణించారు. ఉజ్వల యోజన కింద బీపీఎల్ దిగువన ఉండే కుటుంబాలకు మాత్రమే గ్యాస్ ధరను తగ్గించారని, ఇది ప్రతి ఎన్నికలకు ముందు చేపట్టే కంటితుడుపు చర్యేనని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ 800తో వంట గ్యాస్ సిలిండర్‌ను పేద ప్రజలు ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు మమతా బెనర్జీ.