పుల్వామాలో పాక్ ఉగ్రవాదులు భారత సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిపిన మారణకాండను యావత్ దేశం ముక్త కంఠంతో ఖండిస్తోంది. దేశ ప్రజలందరూ పాక్ చర్యలను దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ వైపు అమరులైన జవాన్లకు నివాళులు అర్పిస్తూనే.. మరో వైపు ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో భారతీయులందరూ పాక్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం పాక్‌ను, ఉగ్రవాదుల చర్యలను సపోర్ట్ చేసి ఉద్యోగాలను ఊడగొట్టుకుంటున్నారు.
తాజాగా ఇక్బాల్ అఖూన్ అనే వ్యక్తి నిజమైన సర్జికల్ స్ట్రైక్ అంటే ఇదే.. అని ఒక సోషల్ మీడియా పోస్టుకు రిప్లై ఇచ్చాడు. దీంతో అతను పనిచేస్తున్న జైడస్ ఫార్మాస్యూటికల్స్ కు చెందిన జర్మన్ రెమిడీస్ కంపెనీ అతన్ని వెంటనే సస్పెండ్ చేసింది. సోషల్ మీడియా అకౌంట్లను వాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెబుతూ అతనికి సస్పెన్షన్ లెటర్‌లో సూచించింది. అలాగే మక్లీడ్స్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో పనిచేస్తున్న రియాజ్ మహమ్మద్ అనే మరో వ్యక్తి కూడా దీన్నే సర్జికల్ స్ట్రైక్ అంటారు.. అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో ఆ పోస్టుపై నెటిజన్లు సదరు కంపెనీకి ఫిర్యాదు చేయగా, ఆ కంపెనీ స్పందించి సదరు ఉద్యోగిని వివరణ ఇవ్వాలని కోరింది. అలా చేయకపోతే 7 రోజుల్లో ఉద్యోగం నుంచి తీసేస్తామని హెచ్చరించింది.
ఇక ఐకాన్ అకాడమీ జూనియర్ కాలేజ్‌లో పనిచేసే పెప్రీ బెనర్జీ అనే మహిళ.. సీఆర్పీఫీఎఫ్ జవాన్లు మరణించడం వారి కర్మ అని, ఆర్మీ వాళ్లు మహిళలను రేప్ చేశారని, పిల్లలను చంపేశారని.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆమెను కాలేజీ వారు సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా ఉగ్రవాదులకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. కొందరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. కనుక ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల సోషల్ మీడియాలో ఏవైనా కామెంట్లు చేసేటప్పుడు, పోస్టులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు..!