స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా కరోనా వ్యాక్సిన్‌.. ఆగస్టు 15 వరకు రెడీ..!

-

దేశంలోని ప్రముఖ ఫార్మా దిగ్గజ సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (బీబీఐఎల్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)లు సంయుక్తంగా కలిసి కరోనా వైరస్‌కు కోవాక్సిన్‌ (Covaxin) అనబడే వ్యాక్సిన్‌ను ఇప్పటికే తయారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను గాను డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు ఇప్పటికే ఫేజ్‌ 1, 2 హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు అనుమతులు ఇచ్చాయి. దీంతో బీబీఐఎల్‌ కోవాక్సిన్‌ ట్రయల్స్‌ను దేశంలోని 12 ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించింది. అయితే ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15వ తేదీ వరకు దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్‌, బీబీఐఎల్‌లు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి.

క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్న 12 మెడికల్‌ ఇనిస్టిట్యూట్లను ట్రయల్స్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే ఐసీఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా ఇనిస్టిట్యూట్‌లు కోవాక్సిన్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేశాయి. ఆగస్టు 15వ తేదీ వరకు ఎట్టి పరిస్థితిలోనూ కోవాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని, ఆ విధంగా పనులు వేగవంతం చేయాలని ఐసీఎంఆర్‌ ఆయా ఇనిస్టిట్యూట్లకు సూచించింది. ప్రస్తుతం ఇది టాప్‌ మోస్ట్‌ ప్రియారిటీ కేస్‌గా పరిగణించి పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పింది. భారత ప్రభుత్వ అత్యున్నత స్థాయి వర్గాలు దీన్ని ప్రముఖంగా పర్యవేక్షిస్తున్నాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. దీంతో కోవాక్సిన్‌ ఆగస్టు 15 వరకు కచ్చితంగా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే అన్నీ సజావుగా సాగి ట్రయల్స్‌ పూర్తయితే ఆగస్టు 15వ తేదీ వరకు కచ్చితంగా కోవాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. అదే జరిగితే భారత ప్రజలకు అది స్వాతంత్య్ర కానుక అవుతుందని భావిస్తోంది. ఇక కోవాక్సిన్‌కు గాను బీబీఐఎల్‌ ప్రీ క్లినికల్‌ స్టడీస్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇటీవలే మోదీ.. కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే ఎవరెవరికి ముందుగా దాన్ని ఇవ్వాలో ఇప్పటికే అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 4 ముఖ్య సూచనలు చేశారు. దీన్నిబట్టి చూస్తే స్వయంగా మోదీయే ఈ విషయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఆగస్టు 15వ తేదీ వరకు వ్యాక్సిన్‌ వస్తే.. దేశ ప్రజలకు అంతకు మించిన అతి పెద్ద స్వాతంత్య్ర దినోత్సవ కానుక ఇంకొకటి ఉండదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version