విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. విజయవాడ నుంచి బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించిందని చెబుతున్నారు. ఒకవేళ ఈ వందే భారత్ ట్రైన్ కు… గ్రీన్ సిగ్నల్ వస్తే… బెంగళూరుకు వెళ్లే వాళ్ళు మూడు గంటల ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
అదే సమయంలో ఈ రైలు బెంగళూరు వెళ్లే వారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. విజయవాడ నుంచి నేరుగా తిరుపతి వెళ్ళిపోవచ్చు. ఇందులో మొత్తం ఎనిమిది బోగీలు ఉంటాయి. ఏడు ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు… ఈ ట్రైన్ నడుస్తుందని చెప్తున్నారు.
ఉదయం విజయవాడలో ఐదు గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. తిరుపతి వెళ్లేసరికి ఉదయం 9 గంటల 45 నిమిషాలు పడుతుంది. ఇక బెంగళూరు వెళ్లేసరికి మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. తిరుగు ప్రయాణం అదే రోజు ఉంటుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రారంభమై.. రాత్రి 11:45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.