ఇతర పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులు చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేసారు. గత ఏడేళ్ళ టీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఆశించిన ఫలితాలు అందుకోలేదని భట్టి అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆయన ఏడేళ్ళ టీఆర్‌ఎస్ పాలనపై మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలన తెలంగాణ ప్రజలను నిరాశ నిస్పృహలకు గురిచేసిందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో బ్రతకొచ్చని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మర్యాద కూడా పొందలేక పోతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అవుతున్నా.. ఉద్యోగాలు లేవని అన్నారు. పీఆర్సీ కమిటీ చెప్పిన లక్ష 72 వేల ఉద్యోగాలు భర్తీ చేయలేదని, ఒక్క డీఎస్సీ కూడా రాలేదని, నిరుద్యోగ భృతి అమలు నోచుకోలేదని అన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీలు కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష అదనపు ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రం నీళ్లను దోచుకుంటుంటే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేల భూదందాలు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయమని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా కనిపిస్తోందని భట్టి ఆరోపించారు.టీఆర్ఎస్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరపడం లేదని అన్నారు. కేంద్రంతో రక్షణ పొందచ్చనే ఉద్దేశంతో కొందరు నేతలు బీజేపీలోకి వెళ్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమేనని ఈ సందర్భంగా భట్టి స్పష్టం చేసారు.