మే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లో రైతు సంఘర్షణ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొని, ప్రసంగించనున్నారు. అయితే ఈ సభను విజయవంతం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్ళందరూ రావాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి రండి అని, వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది సభలో చెప్తామన్నారు. మేము ఇచ్చిన సబ్సిడీలు అన్ని బంద్ అయ్యాయి.
రుణమాఫీ భారం లక్ష నుంచి నాలుగు లక్షలు అయ్యిందని ఆయన మండిపడ్డారు. మేము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. జిగ్నేష్ పై తప్పుడు కేసులు పెట్టింది బీజేపీ అని, తప్పుడు కేసులతో వేధిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన అన్నారు. రాజకీయ లబ్ది కోసం రైతులతో చెలగాటం ఆడోద్దని ఆయన అన్నారు.