ప్రజాసమస్యలపై చర్చించేందుకు కనీసం 20 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రోజులు సభ నడపమంటే అన్ని రోజులు నడుపుతామని ప్రకటించిన తెరాస సర్కార్.. అజెండా పూర్తికాగానే అర్ధాంతరంగా వాయిదా వేస్తోందని ఆరోపించారు. గత సమావేశాల మాదిరిగా కాకుండా.. ఈసారి రాష్ట్రంలోని అన్ని ప్రధాన సమస్యలపై చర్చ జరిగేలా సమయంకేటాయించాలని భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలవిద్య, ఉపాధ్యాయుల సమస్యలు, సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌పై ప్రస్తావించి పరిష్కారానికి చొరవచూపాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు భట్టివిక్రమార్కను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రప్రభుత్వం తెచ్చిన 317 జీవో వల్ల వేలాదిమంది స్థానికతను కోల్పోయారని ఆందోళన వ్యక్తంచేశారు. భార్య భర్తలకు ఒకే చోట ఉద్యోగం కల్పించేట్లు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.