మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ పార్టీలో రాయలసీమ, ఉత్తరాంధ్ర నేతలు జగన్ ప్రకటనను స్వాగతిస్తూ ఆయన్ను కొనియాడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పటికే ట్విట్టర్ లో మీడియా వేదికగా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. కర్నూలు జిల్లాకు చెందిన చంద్రబాబు సన్నిహితుడు కేయీ కృష్ణ మూర్తి కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హైకోర్ట్ ని కర్నూలులో ఏర్పాటు చేస్తామనడం హర్షణీయం అన్నారు.
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు రాజధాని నిరసన సెగ గట్టిగానే తగిలింది. కర్నూలు పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం జరుగుతుండగా… అక్కడికి చేరుకున్న రాయలసీమ విద్యార్ధి సంఘాలు, జెఎసి నేతలు, రాయలసీమలో హైకోర్ట్, రాజధాని అంశంపై తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేసారు. అలాగే రాయలసీమ అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదా అంటూ ఆమెను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అఖిల ప్రియ… కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు వ్యతిరేకం కాదని,ఆ నిర్ణయాన్ని ఆయన సమర్దిస్తున్నారన్నారు.
అయితే రాయలసీమకు ఇంకా న్యాయం చెయ్యాలనేది తమ డిమాండ్ అనగా… కలుగుజేసుకున్న జేఏసి చంద్రబాబు రాజధాని మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనగా, అమరావతి తనతో పాటు వస్తే ఆయనతో మాట్లాడిస్తా అని అఖిల సర్ది చెప్పే ప్రయత్నం చేసారు. పక్కనే ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వారికి సర్ది చెప్పడంతో కాస్త శాంతించారు. ఇదిలా ఉంటే నిరసనకు ముందు మీడియాతో మాట్లాడిన అఖిల, తన నిర్ణయానికి అనుకూలంగా జగన్ కమిటి నివేదిక ఇప్పించారని మండిపడ్డారు. విశాఖకు, రాయలసీమకు రోడ్ మార్గం సరిగా లేదన్నారు.