తల్లి పక్కనే నిద్రిస్తున్న ఎనిమిది నెలల బాలుడిపై అడవి పిల్లి విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మరణించగా.. ఆమె తల్లి గాయపడింది. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్.. ప్రతాప్‌గఢ్‌లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మహులికు చెందిన అజయ్ గౌర్‌కు ఐదుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నాడు. అజయ్.. రాజస్థాన్‌కు కూలీ పనుల నిమిత్తం వలస వెళ్లాడు. అతడి భార్య ఉమ.. గురువారం అర్ధరాత్రి తన 8 నెలల కుమారుడు రాజ్‌తో కలిసి నిద్రిస్తోంది. హఠాత్తుగా ఓ అడవి పిల్లి కిటికీలోంచి వారి గదిలోకి ప్రవేశించింది. విచక్షణారహితంగా రాజ్ శరీరంపై గోళ్లుతో దాడి చేసింది. ఉమను కూడా గాయపరిచి.. అక్కడి నుంచి అడవి పిల్లి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు గదికి చేరుకుని చూసేసరికి రక్తపు మడుగులో రాజ్ కనిపించాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మరణించాడు.
ప్రొఫెసర్ ఆత్మహత్య..
అసోం.. గువహటిలో దారుణం జరిగింది. ఐఐటీ గువహటికి చెందిన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్.. క్యాంపస్‌లోని క్వార్టర్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని సమీర్ కలాంగా గుర్తించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.