గుంటూరు జిల్లా తెనాలిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తెనాలి లో భారీ దొంగతనం జరిగింది. మారీసుపేట మఠంబజారులోని మహాలక్ష్మీ గుడి ఎదురు గల ఇంట్లో కింద పోర్షన్లో నివసిస్తున్న షేక్ సుభానీ – షాహీనా బేగం ఇంట్లోకి చొరబడిన దుండగులు నగలు, నగదు చోరీ చేసుకు వెళ్లారు. భర్త సుభానీ పనికి వెళ్లగా భార్య షాహీనా బేగం గురువారం ఉదయం 11.00 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి పక్కింటి వారితో కలిసి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసే సరికి మెయిన్‌డోరుకు వేసి ఉన్న తాళం పగులకొట్టి ఉంది.
ఇంట్లో బీరువా తలుపులు తెరిచి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన ఆమె త్రీ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ధలానికి వచ్చి ఇంట్లో పరిశీలించి బాధితుల నుండి వివరాలు తీసుకున్నారు పోలీసులు. క్లూస్ టీమ్‌కు సమాచారం ఇచ్చారు. బీరువాలో ఉన్న లక్షకు పైగా క్యాష్, సుమారు 9 సవర్ల బంగారు వస్తువులు చోరీకి గురయ్యాయని భాదితురాలు షాహీనా బేగం తెలిపారు.