తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. రైతు కూలీల కోసం రేవంత్ ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు చెల్లించేలా రైతు ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వ పథకాలను ప్రారంభించింది. అందులో రైతు ఆత్మీయ భరోసా కూడా ఒకటి.
దీని ప్రకారం గ్రామాల్లో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ఆత్మీయ భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, 129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారని పేర్కొంటూ.. ఈ పథకంపై సామాజిక కార్యకర్త గవినోళ్ళ శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం కూలీలు ఎక్కడున్నా కూలీలేనని, నాలుగు వారాల్లో మున్సిపాలిటీలో ఉన్న రైతు కూలీలను కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.