మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడింది. ఆయన గత ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయిన నాటి నుంచి పార్టీ అధిష్ఠానం ఆయనకు ప్రాధాన్యం తగ్గించేసింది. దీంతో ఆయన సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పార్టీ వ్యవహారాలకు కూడా అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడూ పాలేరు నియోజకవర్గంలో మాత్రం పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేది నేనే అంటూ చెప్పుకొంటున్నారట. ఇప్పటికే తుమ్మలపై గెలిచిన ఉపేందర్‌రెడ్డి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇది తుమ్మలకు ఎంతమాత్రం మింగుడు పడలేదు. తుమ్మల వారించినా ఆయన చేరిక ఆగలేదట.
ఇప్పుడు తుమ్మల పాలేరులో తన ప్రాభవాన్ని కోల్పోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీనికి ఇటీవల జరిగిన కొన్ని పదవుల నియామకంలో తుమ్మల వర్గానికి అసలు ప్రాధాన్యమే లేకుండా పోయిందట. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే తనదైన మార్కుతో తన అనుచరులకు న్యాయం చేశారనే వాదన బలంగా ఉంది. దీంతో తుమ్మల తీవ్రంగా నొచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ పరిణామం తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమవుతూ వస్తున్నారట.
హైదరాబాద్ పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినా కార్యక్రమాలకు హాజరు కావడం లేదని సమాచారం. కేసీఆర్ తొలి విడత ప్రభుత్వంలో తుమ్మలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం రాజకీయాలను శాసించడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేయగలిగారు. కొన్ని దశాబ్దాల పాటు తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఏలారు. అలాంటి తుమ్మల నేడు ఇంటికి పరిమితమైన పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదనే తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణలో ఆయన పేరుంటుందని ప్రచారం జరిగింది. తీరా చూస్తే అంతా ఉత్తదే అని తేలింది.
జూనియర్ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రివర్గ విస్తరణలో రవాణాశాఖ దక్కగా..కేబినేట్‌లోకి తీసుకున్నారు. దీంతో సీనియర్ నేతగా జిల్లాలో మొహం చూపెట్టుకోలేక తుమ్మల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారట. అదే టైంలో కేటీఆర్ జిల్లాలో తన వర్గాన్ని పెంచుకునే క్రమంలోనే తనకు సన్నిహితుడు అయిన పువ్వాడ అజయ్‌కు కేబినెట్‌లో మంత్రి పదవి ఇప్పించారని కూడా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తాను పాలేరులోనే పోటీ చేస్తానంటూ తుమ్మల చేసిన ప్రకటనలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ఆయన పార్టీ మారుతారంటూ కొంత ప్రచారం జరుగుతున్నా…అలా ఉండకపోవచ్చని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారట. ఏదేనా ఆయన అసంతృప్తితో ఉన్నారన్నది నిజం.