ప్రస్తుతం ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి ముచ్చెమటలు పట్టిస్తుంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే దేశదేశాలు వ్యాపించి.. అనేక మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇక ఈ రక్కసి బాధితులు 20 లక్షలు దాటారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు పెళ్లిళ్లు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే ఎన్నో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.
అయితే కరోనా వేగంగా విస్తరిస్తున్నా.. లాక్ డౌన్ అమలులో ఉన్నా మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ పెళ్లి వాయిదా వేసుకోలేదు. కాంగ్రెస్ నేత ఎం.కృష్ణప్ప మనవరాలు రేవతితో నిఖిల్ పెళ్లి బెంగళూరు శివారులోని రామనగర సమీపంలో ఉన్న కేతగానహళ్లి ఫామ్ హౌస్ లో నిరాడంబరంగా జరిగింది. కేవలం వందమంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే నిఖిల్ పెళ్లైన కాసేపటికే కుమారస్వామికి షాక్ తగిలింది.
నిఖిల్ పెళ్లిపై ప్రభుత్వం నివేదిక కోరింది. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను వెక్కిరించినట్లౌతుందన్నారు. జిల్లా ఎస్పీతోనూ మాట్లాడామని, వివాహం జరిపించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే పెళ్లి వేడుకలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి.