సైరా నరసింహారెడ్డి చిరంజీవి 151వ చిత్రంగా నేడు భారీ అంచనాలుతో విడుదల అయింది. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది. అయితే ఈ సినిమాకు అదనపు షోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అక్టోబర్ 2 నుంచి 8 తేదీ వరకు స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే అభిమానులంతా అర్థరాత్రి నుంచే థియేటర్లకు క్యూ కట్టారు. అయితే ఈ సినిమాకు వెళ్లిన ఓ ఆరుగురు ఎస్ఐలపై మాత్రం బదిలీ వేటు పడింది.
వివరాల్లోకి వెళ్తే.. . కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో వేకువజామున ఆరుగురు ఎస్సైలు సైరా సినిమాకు వెళ్లారు. సినిమా చూడటం నేరం కాదు, విధుల్లో వుంటూ మూవీ చూడ్డం వల్లే ఈ పనిష్మెంట్ పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లారంటూ జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి వీళ్లు మామూలుగా సినిమా చూసి వచ్చుంటే బాగానే ఉండేది. కానీ వీరు ధియెటర్‌లో సైరా మూవీ చూస్తూ సెల్పీ తీసుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మేటర్ ఎస్‌పీ వరకు వెళ్లింది. దీంతో వీళ్లకు భారీ షాక్ తగిలింది.