వికేంద్రీకరణ బిల్లు, సిఆర్దియే రద్దు బిల్లు మండలిలోకి వెళ్ళగా తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేసారు. ఈ రోజు మండలికి గైర్హాజరు అయిన వరప్రసాద్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన మండలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాగా, నిలబడి నమస్కారం చేసి దగ్గరకు వచ్చి,
చేతిలో చెయ్యేసి మాట్లాడటంపై ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీలో చర్చ జరిగింది. గత ఎన్నికల్లో డొక్కా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి హోం మంత్రి మేకతోటి సుచరిత చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. రాజీనామా చేస్తున్నట్టు సన్నిహితుల వద్ద వ్యాఖ్యాని౦చారట. మాజీ ఎంపీ రాయపాటికి ఆయన శిష్యుడు అంటూ ఉంటారు. దీనిపై స్పందించిన మండలి టీడీపీ పక్ష నేత,
యనమల రామకృష్ణుడు ఆయన అధికారపక్ష నేతలతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక టీడీపీ కి చెందిన మహిళా ఎమ్మెల్సి శమంతకమణి కూడా సభలో లేరు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే సభలో బలం ఉంది బిల్లుని అడ్డుకోవాలని భావిస్తున్న విపక్షానికి ఈ ఇద్దరు ఇచ్చిన షాక్ ఇబ్బందికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే మండలికి పలువురు నామినేటెడ్, బిజెపి సభ్యులు రాలేదు.