బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. కనుక రాత్రి 11 గంటల తరువాతే షోను ప్రసారం చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రముఖ సినీ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా ఈ నెల 21వ తేదీ నుంచి బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 ప్రారంభం కానున్న విషయం విదితమే. కాగా ఈ షో ఇంకా ప్రారంభం కాకముందే అనేక వివాదాల్లో చిక్కుకుంది. యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు ఈ షోపై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. బిగ్‌బాస్ షోలో పాల్గొనాలంటే క్యాస్టింగ్ కౌచ్ చేయాలని తమను కొందరు నిర్వాహకులు అడిగారని ఆరోపిస్తూ వారు షో నిర్వాహకులపై కేసులు పెట్టారు. అయితే ఇప్పుడు ఏకంగా బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు.
బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉంటుందని.. కనుక రాత్రి 11 గంటల తరువాతే షోను ప్రసారం చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇక అప్పుడు కూడా షోకు చెందిన ప్రతి ఎపిసోడ్‌ను సెన్సార్ చేశాకే దాన్ని టీవీలో ప్రసారం చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నిర్వాహకులకు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. అసలే క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో అందరిచే విమర్శలను ఎదుర్కొంటున్న బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పుడు తాజా పిటిషన్‌తో మరిన్ని కష్టాల్లో పడ్డారు.
అయితే మరోవైపు షో నిర్వాహకులు మాత్రం శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తాలు పెట్టిన కేసులను కొట్టి వేయాలని హైకోర్టును ఆశ్రయించారు. వారు ఆరోపించినట్లుగా ఏమీ జరగలేదని.. తమను అభాసుపాలు చేయడానికే కొందరు యత్నిస్తున్నారని బిగ్‌బాస్ షో నిర్వాహకులు ఈ సందర్భంగా తెలిపారు. కాగా షో ప్రారంభానికి మరో 5 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లపై హైకోర్టు ఏమని తీర్పునిస్తుందో వేచి చూడాలి..!