జనాభా నియంత్రణపై బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణకు పురుషులు బాధ్యత తీసుకోరని, మహిళలు కూడా నిరక్షరాస్యులుగా ఉండిపోతుండటంతో ఇది సాధ్యపడటం లేదని నీతీశ్ వ్యాఖ్యానించారు. ‘సమాధాన్ యాత్ర’ పేరుతో నితీశ్ చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా వైశాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపులోకి వస్తుంది. వారు విద్యాధికులైతే గర్భం దాల్చకుండా ఏమేం చేయాలనే దానిపై వారికి అవగాహన ఉంటుంది. ఈ విషయంలో మగవారు నిర్లక్ష్యంగా ఉంటారు. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అణచివేతకు గురవుతూ.. జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే, జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది’’ అని నీతీశ్ వ్యాఖ్యానించారు.
సీఎం వ్యాఖ్యలను ప్రతిపక్ష బీజేపీ తప్పుబట్టింది. ముఖ్యమంత్రి అసభ్య పదజాలంతో రాష్ట్ర ప్రతిష్ఠను దిగాజారుస్తున్నారంటూ విమర్శించింది.