పోలీస్ నియామకాలకు సంబంధించి ప్రాథమిక రాతపరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాతపరీక్ష జరగనుండటంతో ఆయా పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థులు వాటిలో తమ వేలిముద్రలను నమోదుచేయాల్సి ఉంటుంది.
554 ఎస్సై పోస్టుల కోసం జరగనున్న ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2,47,217 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 పరీక్ష కేంద్రాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 35 పట్టణాల్లో సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) శుక్రవారం వెల్లడించింది.
బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవడం తప్పనిసరని మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉదయం పది గంటలకు పరీక్ష జరగనుండటంతో గంట ముందే కేంద్రంలోకి అనుమతించనున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత ఒక నిమిషమైనా అనుమతించరు.
ఇవీ సూచనలు
- అభ్యర్థులు సెల్‌ఫోన్, టాబ్లెట్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, చేతిగడియారం, కాలిక్యులేటర్, లాగ్‌టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీపేపర్లను వెంట తీసుకెళ్లరాదు.
- నగలు ధరించరాదు. హ్యాండ్‌బ్యాగ్, పౌచ్ తీసుకురావద్దు. భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి క్లాక్‌రూంలు ఉండవు.
- అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్నులను మాత్రమే లోనికి తీసుకెళ్లాలి.
- ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరిగణిస్తారు.
- పరీక్షలో నెగెటివ్ మార్కులున్నందున అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానాలు టిక్ చేయాల్సి ఉంటుంది. పరీక్షపత్రం బుక్‌లెట్‌లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషలో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల్లో ఏవైనా సందేహాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే పరిగణనలోకి తీసుకోవాలి.