తెలంగాణలోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులచే అనుసంధానం చేయబడిన బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజా భవన్ లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులచే అనుసంధానం చేయబడిన బర్డ్స్ తెలంగాణ పాకెట్ గైడ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఆవశ్యకతను హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ కోర్ కమిటీ సభ్యులు భట్టికి వివరించారు.
ఈ సందర్భంగా బర్డింగ్ పాల్స్ ప్రెసిడెంట్ హరికృష్ణ మాట్లాడారు. బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్ పుస్తకం తెలంగాణ పక్షుల ఆహారం, వలసలు, పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, విభిన్న ప్రేక్షకులను ప్రత్యేక జీవ వైవిద్యంతో కూడుకున్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావడానికి ప్రోత్సహిస్తుందన్నారు.