హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయ నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వరంగల్ అర్భన్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తాాజాగా విరాళాల పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటిపై పలువురు బీజేపీ కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం దాడికి తెగబడ్డారు. ఆయన ఇంటిపై రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. దీంతో ఇంటిలోని పలు వస్తువులు, కిటికీలు ధ్వంసమయ్యాయి.
అయితే, ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన చల్లా ధర్మరెడ్డి.. తన ఇంటిపై దాడిని ఖండించారు. లెక్కలు అడిగితే ఇంటిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను రామ భక్తుడినేననీ, తన స్వగ్రామంలో రామాలయం సైతం నిర్మించానని తెలిపారు. ఇదివరకు తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నాననీ, బీజేపీ శ్రేణులు పార్టీ కండువాలు కప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
కాగా, రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తూ.. అపవిత్రం చేస్తోందని ఇటీవల ధర్మారెడ్డి ఆరోపించారు. దేవుని పేరుతో లెక్కాపత్తా లేకుండా బీజేపీ శ్రేణులు వసూళ్లకు పాల్పడుతున్నాయనీ, రామాలయం పేరిట వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పాలంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.