ఓహో ఏపీలో బీజేపీ ఇలా బలం పెంచుకోబోతోందా ?

-

ఏపీ అధికార పార్టీ బిజెపి అని అనిపించుకోవాలని ఆ పార్టీ ఏపీ నాయకులు తహతహలాడిపోతున్నారు. ఇప్పటి వరకు బిజెపి ఏపీలో బలపడలేకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలపైన ఆ పార్టీ సీరియస్ గానే దృష్టి పెట్టింది. సొంత పార్టీలో కొంతమంది టీడీపీ , వైసిపి అనుకూల వ్యక్తుల కారణంగానే తాము బలం పెంచుకోలేక పోతున్నామనే ఉద్దేశంతో అటువంటి నాయకులు అందర్నీ గుర్తించి, పూర్తిగా పక్కన పెట్టేసింది. వారికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేయడం, కొంతమంది పై సస్పెన్షన్ వేటు వేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చేశారు. ఒకపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపికి అండగా నిలబడడం, పొత్తు పెట్టుకోవడం వంటి వ్యవహారాలతో తమకు కాస్త బలం పెరిగిందనే అభిప్రాయంలో బిజెపి ఉంది.

ఏదో రకంగా 2024 నాటికి జనసేన సహకారంతో అధికారం దక్కించుకుంటాము అనే విధంగా పావులు కదుపుతూ, ముందుకు వెళుతోంది. మరోపక్క కేంద్ర బిజెపి పెద్దలు జగన్ తో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో, ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ఉద్యమాలు చేసే పరిస్థితి లేకపోవడంతో, పార్టీని బలోపేతం చేసుకునే విషయంపైన ఇప్పుడు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. జనసేన పార్టీతో పొత్తు ఉన్న నేపథ్యంలోనే అధికారం దక్కించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇక అదంతా జరగాలంటే బీజేపీ సైతం ఏపీలో సొంతంగా బలం పెంచుకునే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగా సామాజిక వర్గాల సమతూకం వేసే వ్యవహారానికి శ్రీకారం చుట్టింది.

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉండే కాపు సామాజిక వర్గానికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే గుంటూరు, ప్రకాశం, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉండే కమ్మ సామాజిక వర్గం వారికీ, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి బీజేపీలో ఎక్కువ ప్రాధాన్యం పెంచాలనే విధంగా బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే కుల నాయకులకు బిజెపి లో చేరాల్సిందిగా ఏపీ బీజేపీ నుంచి ఫోన్లు సైతం వెళ్ళినట్లుగా కొద్దిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ ప్రాంతాల వారీగా కుల బలం బీజేపీకి పెరిగేలా ప్లాన్ చేసుకోవడం చూస్తుంటే, అధికారం కోసం బిజెపి ఎంతగా తహతహలాడుతోంది అనే విషయం అర్ధం అవుతోంది. అయితే ఇప్పటికే కులాల వారీగా రాజకీయ పార్టీలకు మద్దతు లభిస్తుండడం చూస్తుంటే, బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా అనేది సందేహంగా మారింది.

కమ్మ సామాజిక వర్గం దాదాపుగా టిడిపి వైపు, రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు, కాపు సామాజిక వర్గంలోని యువత ఎక్కువగా జనసేన వైపు ఉండడంతో, బీసీ సామాజిక వర్గమే ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. వారు ఎటు వైపు మొగ్గు చూపితే, అటువైపు ఫలితాలు ఆశాజనకంగా వచ్చే పరిస్థితి ఉండడంతో, ఆ సామాజిక వర్గాల మద్దతు పొందేందుకు బిజెపి ప్రయత్నిస్తే ఫలితం కనిపించవచ్చు. కానీ అంత తొందరగా ఆ సామాజిక వర్గాలు బిజెపి వైపు వచ్చే అవకాశం ఉందా అనేది పెద్ద అనుమానమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version