మున్ముందు ఏపీలో బీజేపీ టీడీపీ కలసి ప్రయాణం చేస్తాయా? అలాంటి ఊహలే వద్దంటోంది బీజేపీ. తమ పొత్తులో టీడీపీ కలయికే ఉండదని… బీజేపీ తాము మాత్రమే ఉంటామని జనసేన కూడా క్లియర్‌కట్‌గా చెప్పేస్తోంది. టీడీపీ,బీజేపీ పొత్తు ఏపీ రాజకీయాల్లో మళ్ళీ ఎందుకు తెర పైకి వచ్చింది…
2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తనదైన ఒంటరి వ్యూహంతో ముందుకెళ్లారు చంద్రబాబు. ఆయన ఊహలన్నీ తారుమారయ్యాయి. కేంద్రంలో మోడీ సూపర్ మెజార్టీతో పవర్‌లోకి వస్తే… ఇక్కడ చంద్రబాబు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. రాజకీయంగా అత్యంత పటిష్టమైన స్థితిలో ఉన్న బీజేపీని వదులుకోవడం పెద్ద తప్పేనని ఎన్నికల తర్వాత కానీ బాబుకు తెలిసిరాలేదు. అయితే అప్పటి నుంచి ఆయన.. బీజేపీతో సానుకూల వ్యవహారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.
టిడీపీ పొత్తు పై పవన్ కల్యాణ్ కూడా అదే మాట అంటున్నారు. బీజేపీ జనసేన పొత్తు మాత్రమే ఉంటుంది గానీ..వాళ్ల టీమ్‌లో టీడీపీకి చోటు లేదన్నది పీకే వాదన. టీడీపీ మాత్రం ఇప్పటికిప్పుడు దీనిపై స్పందించడం లేదు. ఎలక్షన్లకు ఇంకా చాన్నాళ్లు ఉన్నాయి కనక..తొందరపడి ఏమీ మాట్లాడకుండా సాధ్యమైనంతవరకు బీజేపీతో ప్రత్యక్షంగానో..పరోక్షంగానో..కలిసి ఉండాలన్నది సైకిల్ పార్టీ వ్యూహం.
బీజేపీ దూరంగా పెడుతున్నా..ఆపార్టీ విధానాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ మీతోనే మీవెంటే అన్న సందేశాన్ని బీజేపీ హైకమాండ్‌కు పంపుతున్నారు. అయితే ఈ పప్పులేవీ ఉడకవని… టీడీపీతో కలసి ప్రయాణించే అవకాశమే లేదని… ఆపార్టీ ముఖ్యనేత సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేసేశారు.