మరికొద్ది రోజులలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార బిజెపి పార్టీకి షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేయాలనుకున్న ఆయనకు నిరాశ మిగిలింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశమైనప్పటికీ టికెట్ మాత్రం దక్కలేదు.
దీంతో తీవ్ర కోపానికి గురైన షెట్టర్.. సీఎం బసవరాజ్ బొమ్మై ని కలిసిన తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక నేడు ఉదయం కాంగ్రెస్ పార్టీ తీర్థం కూడా స్వీకరించారు. సోమవారం ఉదయం బెంగుళూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా షెట్టర్ మాట్లాడుతూ.. బిజెపి పార్టీని కిందిస్థాయి నుంచి పటిష్టం చేసిన తాను ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. కర్ణాటకలో బిజెపిని బలపరిచేందుకు నిరంతరం పనిచేస్తే.. తనకి అధిష్టానం అన్యాయం చేసిందని అన్నారు. కనీసం తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా టికెట్ నిరాకరించారని.. ఈ నిర్ణయంతో షాక్ అయ్యానని తెలిపారు. బిజెపి కొందరు వ్యక్తుల నియంత్రణలో ఉందని.. తాను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లో చేరుతున్నానని తెలిపారు షెట్టర్.