బిజెపి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు – బాల్క సుమన్

-

మంచిర్యాల: సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో బిఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు చేపట్టాయి. సింగరేణి ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు ఆ పార్టీ నేతలు. ఈ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదన్నారు. సింగరేణి నల్ల బంగారం.. తెలంగాణకు కొంగుబంగారం అన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆరోపించారు.

కేంద్రం కుట్రలకు నిరసనగా మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం కేంద్రాల్లో కార్మికులు బగ్గుమన్నారు. కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మరోసారి సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి, పెనగడప గనులను వేలం వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మార్చి 29 నుంచి మే 30 వరకు గనులకు వేలం వేసే ప్రక్రియను నిలిపివేసి నేరుగా సింగరేణికి గనులు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేసీఆర్ గారు డిసెంబర్ 7, 2021 కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వం సింగరేణిని కూడా తెగ నమ్మాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. లాభాల బాటలో వున్న సింగరేణికి.. భవిష్యత్తులో బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలన్న కుతంత్రం కేంద్రం చేస్తున్నదన్నారు. అబద్ధాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బండి సంజయ్‌ అని మండిపడ్డారు బాల్క సుమన్. సింగరేణి బొగ్గు గనులు వేలానికి పెట్టడం దుర్మార్గమని బాల్క సుమన్‌ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని బిజెపి నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version