దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత ఊపు మీద ఉన్న బీజేపీ అదే దూకుడుని నాగార్జునసాగర్‌కు జరగబోయే ఉపఎన్నికలో కొనసాగించాలని అనుకుంటోంది. కానీ సాగర్ లో బలాన్ని పరిగణలోకి తీసుకుంటే నాగార్జునసాగర్ ఉపఎన్నిక అంత వీజీ కాదని కమలనాథులకు అర్ధమైంది. దుబ్బాకలా ప్రభావం చూపించాలంటే ఏ ప్యూహాన్ని అమలు చేయాలి..ఏం చేస్తే కమలం గాలి వీస్తుందని సర్వేల లెక్కలు చెప్పాయన్నదాని పై సాగర్ లో బీజేపీ ఫోకస్ చేసిందట….
తెలంగాణలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే నాగర్జునసాగర్ లో బీజేపీ అంత బలంగా లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడ 3 వేల ఓట్లు కూడా రాలేదు. బలమైన కేడర్ కూడా లేదన్నది స్థానికంగా వినిపించే టాక్. అయినా.. సత్తా చాటేందుకు కమలనాథులు చాలా వ్యూహాలు రచిస్తున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ మూడో ప్లేస్‌లో ఉన్నా.. ఉపఎన్నికలో గెలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను ఉదహరిస్తున్నారు ఆ పార్టీ నాయకులు.
రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ నేత గరికపాటి మోహన్‌రావు బీజేపీ చేరినప్పుడు నాగార్జునసాగర్‌కు చెందిన మరికొందరు నాయకులు కూడా కాషాయ కండువా కప్పుకొన్నారు. అందుకే 2018 ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం వల్ల ఉపయోగం లేదని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. దీనికితోడు రాష్ట్రంలో మారిన పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నది వారి మాట. నియోజకవర్గంలో బూత్ స్థాయి నుంచి బీజేపీ వర్క్ మొదలైపోయింది. అసెంబ్లీ ఎన్నికల కోఆర్డినేటర్లను ప్రకటించి ఉపఎన్నికకు సన్నద్ధమవుతోంది. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడా సురేష్‌రెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించి క్షేత్రస్థాయిలో చురుకు పుట్టిస్తున్నారట.
గత ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన కంకణాల నివేదిత రెడ్డి, 2014లో బీజేపీ పొత్తుతో టీడీపీ నుంచి పోటీ చేసిన కడాలి అంజయ్య యాదవ్‌లు ఈ ఉప ఎన్నికలో టికెట్ ఆశిస్తున్నారు. అంజయ్య యాదవ్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. పార్టీ పెద్దల నుంచి టికెట్‌పై హామీ లభించకపోయినా ఇద్దరు పోటాపోటీగా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. అయితే ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరు పార్టీకి చేటు తెస్తుందని గ్రహించిన బీజేపీ నాయకులు.. వారిని పిలిచి మాట్లాడారట. ఎంత నచ్చజెప్పినా వారు తమకే టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టినట్టు సమాచారం.
గతంలో నివేదిత రెడ్డి పోటీ చేసినప్పుడు సంఘ్ పరివార్ క్షేత్రాలు మద్దతిచ్చాయి. ఈసారి టికెట్ విషయంలో మాత్రం.. పరివార్ క్షేత్రాలు బీజేపీ ఇష్టానికే వదిలేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాతే నాగార్జునసాగర్‌లో బీజేపీ సర్వేలు చేయిస్తోందట. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు.. లోకల్ లీడర్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై బీజేపీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు సమాచారం. నాగార్జునసాగర్‌లో ప్రభావం చూపెట్టాలి అంటే చాలా కష్టపడాలి అనే సర్వేలో వెల్లడించారట. ఇప్పుడు దీనిపైనే కమలనాథులు ఫోకస్ పెట్టారట.
రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని భావిస్తోన్న కమలనాథులు.. ఒకసారి నాగార్జునసాగర్‌కు అగ్రనేతలను తీసుకొచ్చి ప్రచారం చేస్తే రాజకీయ వాతావరణం ఛేంజ్ అవుతుందని భావిస్తున్నారట. మొత్తానికి సాగర్‌లో అంత వీజీ కాదని అనుకుంటున్న బీజేపీ నాయకులు సాగర్ లో కొత్త పొలిటికల్ గేమ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.