బండి సంజయ్‌ సొంత జిల్లాలో కమలం ఆపరేషన్‌ ఆకర్ష్‌

-

తెలంగాణ బీజేపీలో చేరికలు పెరిగాయి. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకు.. వచ్చిందే తడవుగా కాషాయ కండువా కప్పేస్తున్నారు కమలనాథులు. ఈ సందర్భంగా అందరి దృష్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాపై పడింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ సొంత జిల్లా కావడం పైగా కరీంనగర్‌ ఎంపీగా ఉన్నారు. సంజయ్‌ సొంత జిల్లా నుంచి చేరికలు భారీగానే ఉంటాయని టాక్‌ నడుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా పార్టీలకు చెందిన నాయకులు కాషాయ కండువా కప్పుకొనేందుకు ఆసక్తితో ఉన్నారట.

ముఖ్యంగా జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు.. బండి సంజయ్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు, మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌, ధర్మపురిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నన్ని రోజులూ మాజీ ఎమ్మెల్యేలు ఏం చెబితే అది జిల్లాలో సాగేది. ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని సమాచారం. అందుకే వారికి బీజేపీ ఓ ఆశాకిరణంగా కనిపిస్తోందట.

విజయరమణరావు టీడీపీలో ఉండగా ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరినా పేరులో విజయం తప్ప.. రాజకీయంగా విక్టరీ కొట్టలేకపోయారు. పైగా కాంగ్రెస్‌ నేతలు ఆయనతో టచ్‌మీ నాట్‌ అన్నట్టే ఉంటున్నారట. ఒకవేళ టికెట్‌పై బీజేపీ క్లారిటీ ఇస్తే మారిపోవడానికి విజయరమణరావు సిద్ధంగా ఉన్నారని.. ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ సైతం కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరినా గుర్తింపు లేదని తెగ ఫీలవుతున్నారట. పైగా మానుకొండూరులో బీజేపీ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

ఒకవేళ మోహన్‌ కాషాయ కండువా కప్పుకొంటే ఆయనే బీజేపీ అభ్యర్థి అవుతారని అనుకుంటున్నారు. బండి సంజయ్‌తో మోహన్‌ రహస్యంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ధర్మపురిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు అడ్లూరి లక్ష్మణ్‌. నియోజకవర్గంలో ఆయనకంటూ ఓ కేడర్‌ ఉంది. ఇది తెలుసుకున్న బీజేపీ నాయకులు లక్ష్మణ్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. అన్నీ ఓకే అనుకుంటే లక్ష్మణ్‌ కూడా బీజేపీకి జై అంటారని చెవులు కొరుక్కుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు.. స్థానిక బీజేపీ నాయకులు, కేడర్‌తో కలిసి పనిచేసే విధంగా సంజయ్‌ అండే బ్యాచ్‌ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఇవన్నీ కొలిక్కి రాగానే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పొలోమని మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరతారని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version