భారతీయ జనతాపార్టీ ఉనికే లేని రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీని నరేంద్రమోడీ, అమిత్ షా బలోపేతం చేయగలిగారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసుకొని, కలిసొచ్చేవారిని కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించాలంటూ ప్రధానమంత్రి , హోం మంత్రి పార్టీ అధ్యక్షులకు ఎప్పుడూ సూచిస్తుంటారు. అటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడం మాత్రం వారివల్ల కావడంలేదు. ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు గెలవడం సంగతి అటుంచితే కనీసం వార్డు సభ్యులను కూడా గెలిపించుకోలేని దుస్థితికి రోజురోజుకూ బీజేపీ దిగజారిపోతోంది. రాష్ట్ర నాయకత్వ లోపమే దీనికి కారణం. తెలంగాణలో ఎంత వేగంగా బీజేపీ బలపడుతోందో.. ఏపీలో అంతే వేగంగా కిందకి జారిపోతూ వస్తోంది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది
ఏపీలో బీజేపీ నేతలెప్పుడూ చాలా చురుగ్గా వ్యవహరిస్తుంటారు.. ప్రజల్లో కాదు సుమా.. ఫేస్ బుక్‌లో, ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, టెలిగ్రామ్‌లో, వాట్సాప్ లో… క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకొని ప్రజల్లో పార్టీని నిలబెట్టి తమనుతాము బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టకుండా ఇతరులపై ఆధారపడి సీట్లు సంపాదిద్దామనే కుయుక్తులకు లోటేంలేదు. పగలు ఒక పార్టీతో చెలిమి చేస్తుంటారు.. రాత్రి వేరే పార్టీవారితో మాట్లాడుతుంటారు. స్నేహితుడు ఒక్కడే… కాకపోతే ప్రాంతాన్నిబట్టి.. పరిస్థితిని బట్టి మారిపోతుంటారుకానీ పేరు మాత్రం ఒకటే ఉంటుంది.
చందాబాబు… ఏసుబాబు
ట్విట్టర్ వేదికగా అటు చంద్రబాబుపై, ఇటు వైయస్ జగన్ పై విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు అప్పుడు చందా బాబు, ఇప్పుడు ఏసుబాబు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పథకాలపై జగన్ సర్కార్ తమ స్టిక్కర్లను వేసుకొని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక జాబితా విడుదల చేసి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న పథకాలు కిసాన్ సమ్మాన్ నిధిని వైయస్సార్ రైతు భరోసాగా, పీఎం కిసాన్నిధి పథకాన్ని జగనన్న తోడుగా , ఆయుష్మాన్ భారత్ ను వైయస్సార్ ఆరోగ్యశ్రీ గా జగన్మోరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.