వాస్తు మార్పుతో తెలంగాణలో కమలం వికసిస్తుందా

-

వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలపడాలన్నది బీజేపీ వ్యూహం. బండి సంజయ్‌ సారథి అయిన తర్వాత కొంత స్పీడ్‌ పెరిగింది కూడా. దుబ్బాక,గ్రేటర్ ఎన్నికల ఫలితాలు కమలనాథులకు మంచి ఊపు కూడా తెచ్చాయి. అయితే వీటికంటే ముందు జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటలేకపోయింది. ఒక్క ఎమ్మెల్యేనే గెలిచారు. అప్పటి వరకు ఉన్న సిట్టింగ్‌ స్థానాలను సైతం కోల్పోయింది. దీంతో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ఆఫీసులో వాస్తు దోషాలు ఉన్నాయని గ్రహించారట నాయకులు. నైరుతి నుంచి మొదలు పెట్టి ఈశాన్యం వరకు పార్టీ ఆఫీస్‌లో మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నారట. దీంతో కమలం పార్టీ స్పీడ్ ప్రత్యర్ధులను పరుగులు పెట్టిస్తుందట…

అసలే బీజేపీ.. వాస్తు పట్టింపులు.. పూజలు ఎక్కువగానే ఉంటాయి. వాస్తు ప్రకారమే నాడు పార్టీ ఆఫీస్‌ కట్టి ఉంటారు. కానీ.. ఏదో తేడా కొడుతుందని భావించిన అప్పటి బీజేపీ రాష్ట్ర చీఫ్‌ లక్ష్మణ్‌.. కొన్ని మార్పులు చేపట్టారు. బాత్రూమ్‌లు ఉండకూడని చోట ఉన్నాయని వాటిని కూలగొట్టి ప్లేస్‌ మార్చారు. ఇది 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మార్పులు. అంతే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ సీట్లు బీజేపీకి వచ్చాయి. ఇదంతా పార్టీ ఆఫీస్‌లో జరిగిన వాస్తు మార్పుల వల్లే అని విశ్వసించారట నాయకులు. అంతే.. వాస్తు గురించి తెలిసిన వారిని పిలిచి ఆఫీస్‌ మొత్తం చూపించారట. వారిలో కొందరు సూచించిన విధంగా మెయిన్‌ డోర్‌ నుంచి కాకుండా సైడ్‌ డోర్‌ నుంచి ఆఫీస్‌లోకి వెళ్లారు లక్ష్మణ్‌. ఆ ఎఫెక్టో ఏమో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత ఏకంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారని చర్చ మొదలైంది.

ఇంత వరకు బాగానే ఉన్నా.. బండి సంజయ్‌ చీఫ్‌గా వచ్చిన తర్వాత ఈ వాస్తు మార్పులు ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. అధ్యక్షుని ఛాంబర్‌లో గతంలో లక్ష్మణ్‌ కూర్చున్న ఫేసింగ్‌ కాకుండా కాస్త టర్న్‌ ఇచ్చుకున్నారట. ఆఫీస్‌ సెల్లార్‌లోకి వెళ్లేదారిని మూసేశారు. అక్కడ గోడ కట్టేశారు. ఈశాన్యంలో ఖాళీ ఉండాలని బీజేపీ కార్యాలయం గోడను జరుపుతున్నారు. ఆ పని దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక బీజేపీ ఆఫీస్‌ మెయిన్‌ డోర్‌ను దాదాపుగా క్లోజ్‌ చేసేశారు. ఏదైనా అర్జెంట్‌ ఉంటేనో.. ఎక్కువ మంది కార్యకర్తలు వస్తేనో ఆ తలుపులు తీస్తున్నారు.

సంజయ్‌ చేపట్టిన ఈ మార్పులు తర్వాత దుబ్బాకలో బీజేపీ బోణీ కొట్టింది. గ్రేటర్ లో బలం పెరిగింది. త్వరలో ఎమ్మెల్సీ.. మరికొన్ని మున్సిపాలిటీ ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్‌ బై ఎలక్షన్‌ సైతం రాబోతోంది. వీటిల్లోనూ ఆశించిన ఫలితాలే వస్తాయన్నది కమలనాథుల నమ్మకం. అందుకు తగ్గట్టుగానే పార్టీ ఆఫీసులో మరిన్ని వాస్తు మార్పులు చేపట్టొచ్చన్నది నేతలు చెబుతున్న మాట. ఇక్కడ గోడలు కూలగొట్టి కొత్త గోడలు జరిపి కడితే.. తలుపులు మూసేస్తే.. ఎన్నికలు జరిగేచోట జనాల నాడి పట్టేయొచ్చని గట్టిగాన నమ్ముతున్నారట కమలనాథులు.

వాస్తు విషయంలో ఎవరి నమ్మకాలు వారివి. ఇందులో బీజేపీ నేతలు ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తారు. అది ఆ పార్టీ వాళ్ల ఇష్టం. కాకపోతే.. ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లను ఆకర్షించాలి. ప్రజల అటెన్షన్‌ తీసుకొచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలి. దానికితోడు అదృష్టం కూడా కలిసి రావాలి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఇప్పుడు వాస్తు మార్పులు చేశాం కదా అని సైలెంట్‌ అయితే మాత్రం మొదటికే మోసం వస్తుందని కొందరు పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version