వైసీపీని టెన్షన్ పెడుతున్న విజయనగరం వర్గపోరు

-

విజయనగరం జిల్లా వైసీపీలో మళ్లీ ముసలం మొదలైంది. ఇప్పటికే నెల్లిమర్ల పంచయతీతో సతమతమవుతున్న ఫ్యాన్ పార్టీకి మంత్రి బొత్స , విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల అనుచరుల మధ్య వర్గపోరు మరింత టెన్షన్ పెడుతుంది. విజయనగరం రాజకీయాలను బొత్స లైట్ తీసుకున్న బొత్స,కొలగట్ల అనుచరులు మాత్రం కత్తులు దూసుకుంటున్నారు. ఈ వివాదాలకు విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వేదికగా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఏడాది క్రితం విజయనగరం కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ మొదలైన సమయంలో బొత్స వర్గానికి కాకుండా తన అనుచరులకు మాత్రమే ఎమ్మెల్యే కోలగట్ల టికెట్లు ఇచ్చుకున్నారు. దీంతో బొత్స వర్గంగా ముద్రపడ్డ అవనాపు సోదరులతోపాటు పలువురు రెబల్స్‌గా బరిలో దిగారు. ఆ తర్వాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇంతలో అంతా సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం.. తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు మొదలవుతాయనే ఊహాగానాలతో అప్పట్లో రెబెల్‌గా నామినేషన్లు వేసిన వారంతా యాక్టివ్‌ అయ్యారు. వైసీపీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, వైసీపీ నేత మజ్జి శ్రీనివాస్‌తోపాటు మరికొందరు నేతలకు వినతిపత్రాలు అందజేశారు.

అప్పట్లో ఆగిపోయిన కార్పొరేషన్‌ ఎన్నికలు.. మళ్లీ మొదటి నుంచి మొదలుపెడతారో లేక ఆగిన దగ్గర నుంచే ప్రారంభిస్తారో కానీ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం గేర్‌ మార్చడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పార్టీ నేతలను కలిసి ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ప్రస్తావించిన అంశాలు కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రక్రియ కొత్తగా మొదలైతే తమకు వైసీపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరారు. అప్పట్లో ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అని ముందుకెళ్లిన రెబల్స్‌ ఇప్పుడు.. న్యాయం చేయాలంటూ మంత్రి, ఎంపీ, ఇతర నేతల దగ్గరకు వెళ్లడంపై గుసగుసలు మొదలయ్యాయి. రెబల్స్‌ వెనక ఎవరైనా పెద్దలు ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. విజయనగరం పట్టణంపై పట్టుకోసమే బొత్స వర్గం తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని టాక్‌.

 

బొత్స, కోలగట్ల ఇద్దరూ గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. ఇద్దరు సన్నిహితులే. బొత్స కంటే ముందుగానే వైసీపీలో చేరిపోయారు వీరభద్రస్వామి. జిల్లాలో తానే వైసీపీకి తిరుగులేని నాయకుడిని అని ఆయన అనుకుంటున్న సమయంలో బొత్స రాకతో సమస్య మొదలైందని చెబుతారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య చాపకింద నీరులా విభేదాలు ఉన్నాయి. వీరి మధ్య పంచాయితీలు గతంలో పార్టీ పెద్దల దగ్గరకు వెళ్లాయి. అక్కడ సర్దిచెప్పి పంపినా క్షేత్రస్థాయిలో తీరుమారలేదు. ఒకానొక సమయంలో ఎన్నికల్లో ఇద్దరూ ఒకరినొకరు ఓడించుకునేందుకు సైతం స్కెచ్‌లు వేసుకున్నారని పార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి. ప్రస్తుతం బొత్స, కోలగట్ల కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా.. కేడర్‌ మధ్య ఏర్పడిన గ్యాప్‌ అలాగే ఉందట. కార్పోరేషన్ ఎన్నికల వేళ ఈ వర్గపోరు వైసీపీ నేతల్ల్లో టెన్షన్ పుట్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version