కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారన్న వార్తలు గత కొంత కాలంగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లతో ఒక్కసారిగా తెరమీదకు వచ్చి సెంటర్ ఆఫ్ ద ఎట్రాక్షన్‌గా మారిన ముద్రగడ ఏపీ సీఎంగా జగన్ అయ్యాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ల కోసం మధ్యలో ఒకటి రెండు సార్లు జగన్‌కు లేఖలు రాయడం మినహా ఆయన చేసిందేమి లేదు. ఇక కొద్ది రోజుల క్రితం తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానంటూ ముద్రగడ చేసిన ప్రకటన సంచలనం రేపింది. తన సామాజిక వర్గంలోనే కొందరు తనపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తనపై విమర్శలు చేసే వారే కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయవచ్చని పిలుపు ఇచ్చారు.
ఇదిలా ఉంటే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకుంటోన్న ముద్రగడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని.. తాను కాపు జాతి కోసం ఎంతో కష్టపడ్డానని.. ఆర్థికంగా కూడా దెబ్బతిన్నానని.. అయితే తన సామాజిక వర్గం వారే తనను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తితో ఉన్న ఆయనకు బీజేపీ మంచి ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. ఏపీలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు అందరిని ఐక్యం చేయడం కోసం బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలోనే కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు లాంటి నేతలకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇచ్చింది. ఇక ఇప్పుడు ముద్రగడ సేవలను కూడా వాడుకుంటే.. కాపు జాతి ఓట్లన్ని తమకే ఉంటాయన్నది బీజేపీ ప్లాన్. ఇక జనసేనతో పొత్తు ఎలాగూ ఉండనే ఉంది. ముద్రగడ + పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌తో పాటు ఏపీ బీజేపీ పగ్గాలు కూడా కాపు చేతుల్లోనే ఉండడంతో కాపుల్లో ఐక్యత వస్తుందని బీజేపీ భావిస్తోంది. ముద్రగడను తమ పార్టీలో చేర్చుకుని. ఆయనకు మంచి పదవి ఇస్తే టీడీపీ, వైసీపీ వైపు ఉన్న కాపులు నిట్ట నిలువునా చీలిపోతారన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరి బీజేపీ ప్లాన్ ఎలా ఉన్నా ? ముద్రగడ ఏం చేస్తారో ? చూడాలి.