తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతుంది..టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే పరిస్తితికి బీజేపీ వస్తుంది. అయితే బీజేపీ బలం పెరిగిందని దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, మునుగోడులో గట్టి పోటీ ఇచ్చి ఓడిపోవడం వల్ల కాస్త తెలిసింది. అయితే ఈ ఉపఎన్నికలతో రాష్ట్రం మొత్తం బీజేపీ బలం పెరిగిపోయిందని చెప్పలేం. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఇంకా బీజేపీ బలం పెరగాలి..అలాగే దుబ్బాక,హుజూరాబాద్ ల్లో విజయం అక్కడ నాయకుల వచ్చిందని అంటున్నారు.
అలాంటప్పుడు మిగిలిన స్థానాల్లో కూడా బీజేపీకి బలమైన నాయకులు కావాలి. మరి 119 స్థానాల్లో బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారా? అంటే గట్టిగా తిప్పికొడితే 60 స్థానాల్లో కూడా బలమైన నాయకులు ఉండరనే చెప్పాలి. వాస్తవానికి టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్నవారు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపే చూస్తున్నారని మునుగోడుతో ఉపఎన్నికతో అర్ధమైంది. అలా అని అన్నీ స్థానాల్లో బీజేపీని ఆదరిస్తారనే పరిస్తితి లేదు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ బలంగానే కనిపిస్తోంది. కాబట్టి దాదాపు అన్నీ స్థానాల్లో బీజేపీకి బలమైన నాయకులు కావాలి.
అలా అని ఇప్పటినుంచి కింది స్థాయి నేతలని పైకి తీసుకురావడం కష్టం. వారు పైకి ఎదిగే సరికి చాలా సమయం పడుతుంది. ఏదో కొందరు నాయకులు మండల స్థాయిలో ప్రభావితం చేయగలుగుతారు తప్ప..అలాంటి వారిని అసెంబ్లీ స్థానాల బరిలో నిలబెట్టలేరు. కాబట్టి బీజేపీలోకి వలసలు నడవాలి. అంటే టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల్లో ఉన్న బలమైన నేతలు బీజేపీలోకి రావాలి. కాంగ్రెస్ నుంచి వస్తున్నారు గాని బలమైన నేతలు రావడం లేదు.
ఇక ఎమ్మెల్యే కొనుగోలు కేసుతో టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసకు కాస్త బ్రేక్ పడ్డాయి. నిదానంగా ఆ పరిస్తితి నుంచి బీజేపీ బయటపడి..టీఆర్ఎస్ నుంచి కొందరిని లాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే బీజేపీకి బలమైన నాయకులు దొరుకుతారు. అలా గాని దొరక్కపోతే ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బంది అవుతుంది.