టీ బీజేపీలో చేరికలు సరే..అందులో పట్టున్న నేతలు ఎందరు

-

తెలంగాణలో బీజేపీలో చేరేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది.గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు కాషాయ కండువా కప్పుకుంటున్నారు. కొందరు హైదరాబాద్, మరికొందరు ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. మరికొందరు తమ సొంత ఇలాకాలోనే సభలు పెట్టుకొని కమలతీర్థం పుచ్చుకుంటున్నారు. బీజేపీలో చేరికలు బాగానే ఉన్నా అందులో సత్తా ఉన్న నేతలు ఎందరు అన్నదాని పై ఇప్పుడు కమలం పార్టీలోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది.


తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనే అభిప్రాయంతో ఇతర పార్టీల నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముందుగా వెళ్లి కర్చీఫ్ వేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన అన్ని స్థాయిల నేతలు బీజేపీలోకి వరుస కడుతున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ లో చేరే వారి సంఖ్య మరింత పెరిగింది. నేతల చేరికలు బాగానే ఉన్నా అందులో కేడర్ పలుకుబడి ఉన్న నేతలు ఉన్నారా అన్నదానిపై కమలం పార్టీనేతల్లోనే అంతర్గతంగా చర్చ నడుస్తుంది.

గత కొన్ని రోజులుగా ఎవరో ఒకరు పార్టీలో చేరుతూనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే.. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ ఢిల్లీలో నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరారు. సిర్పూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ నేత పాల్వాయి హరీష్ తన సొంత ఇలాకలో సభ పెట్టి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ల సమక్షంలో పార్టీ లో చేరాడు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి, జనగామ జిల్లాలకు చెందిన స్థానికసంస్థల ప్రజా ప్రతినిధులు బండి సంజయ్ సమక్షంలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన నేతలు బండి సంజయ్,ఎంపీ అరవింద్ సమక్షంలో బాన్సువాడలో సభ పెట్టి చేరారు. నాన సాగర్ నియోజకవర్గానికి చెందిన స్థానిక నేతలు,ద్వితియ శ్రేణి కాంగ్రెస్ నేతలు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే బీజేపీలో చేరికలు బాగానే ఉన్నా జిల్లా నియోజకవర్గస్థాయిలో ప్రభావం చూపగల నేతలపై దృష్టి సారిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా నడుస్తుంది. నాయకులు పార్టీలో చేరారు అంటు చేరారు అనేలా కాకుండా యువ నాయకత్వం,నియోజకవర్గంలో కాస్తో కూస్తో క్రేజ్ ఉండి ప్రభావం చూపించే నాయకుల పై దృష్టి సారిస్తే పార్టీ బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇతర పార్టీల్లో పదవులు అనుభవించి అక్కడ ఫేడ్ ఔట్ అయిన నాయకులను బీజేపీలో చేర్చుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదన్న చర్చ నడుస్తుంది. జిల్లాల్లో కాస్తో కూస్తో పట్టుండి పార్టీని నడిపించగలరన్న నమ్మకం ఉన్న నేతల పై దృష్టి సారిస్తే పార్టీకి ప్రయోజనం కలిగి వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కి ధీటైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version