మొన్న కరోనా.. నిన్న మిడతలు.. నేడు రాక్షస పురుగులు.. జనాలను భయపెడుతున్నాయి. అయితే ఆ పురుగులు మాత్రం మన దగ్గర కాదులెండి.. భయపడాల్సిన పనిలేదు. అవి రష్యావాసులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ పురుగుల సంఖ్య ఇప్పుడు ఏకంగా 428 రెట్లు ఎక్కువైందని, అలాగే వాటి జన్యువుల్లో వచ్చిన మార్పుల కారణంగా అవి కుడితే.. మనుషులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రష్యాకు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు.
రష్యాలోని సైబీరియా సహా పలు ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం ఆ పురుగుల సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలో అక్కడి క్రాస్నోయార్‌స్క్ అనే ప్రాంతంలోనే 8215కు పైగా జనాలకు పురుగులు కుట్టాయని అక్కడి వైద్యులు తెలిపారు. వారిలో 2125 మంది చిన్నారులే ఉన్నారు. సాధారణంగా ఆ ప్రాంతంలో ఒక చదరపు కిలోమీటర్‌కు 0.5 చొప్పున పురుగులు ఉండేవట. కానీ ఇప్పుడు వాటి సంఖ్య 214కు పెరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ఆ పురుగులు జనాలను కుట్టేందుకు బయటకు వస్తున్నాయి.
రష్యాలోని స్వెర్‌డ్లొవ్‌స్క్ ప్రాంతంలో ఉన్న ఉరాల్స్ అనే ఏరియాలో 17,242 మందిని ఆ పురుగులు కుట్టాయి. వారిలో 4334 మంది చిన్నారులు ఉన్నారు. అయితే పురుగులు కుట్టిన వారికి ఎన్‌సెఫలైటిస్ అనబడే తీవ్రమైన మెదడు వ్యాధి వస్తుందని, దీంతో బాధితులు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. వారిని పురుగు కుట్టాక 4 రోజుల్లోగా వ్యాక్సిన్‌ను వారికి ఇవ్వాలని వైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆ వ్యాక్సిన్లకూ అక్కడ తీవ్ర కొరత నెలకొంది. దీంతో బాధితులకు ఎలా చికిత్స చేయాలా.. అని వైద్యులు తలపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకూడదని వారు కోరుతున్నారు.
కాగా ఆ పురుగులు గడ్డిలో ఎక్కువగా ఉంటాయని.. మన శరీరంపై వాలిన వెంటనే చర్మంపై కుట్టి రక్తం తాగుతాయని వైద్యులు తెలిపారు. ఇక 2015లో ఇలాంటి పురుగులు కుట్టడం వల్ల అక్కడ 1.50 లక్షల మంది వరకు చనిపోయారు.