స్వాతంత్య్ర దినోత్సవం రోజున తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీ నుంచి బౌంద్ వెళ్లే తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉన్నట్లు ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలులోని ప్రయాణికులందరిని కిందకు దించి తనిఖీలు చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో జరిగింది.
సోమవారం రోజున తాజ్ ఎక్స్‌ప్రెస్‌లోని డీ2 బోగిలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. దిల్లీ వెళ్లే లోపు పేలుతుందని హెచ్చరించారని చెప్పారు. వెంటనే అప్రమత్తమై రైలును మథురా రైల్వే స్టేషన్లో నిలిపి తనిఖీలు చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితుడిని గుర్తించారు. షాహన్గంజ్ ప్రాంతానికి చెందిన ముఖేశ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు.
“తాజ్ ఎక్స్‌ప్రెస్.. మథురా జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఉదయం 7:29 కు చేరుకోగానే నిలిపివేశాం. ప్రయాణికులను కిందకు దించి పూర్తిగా తనిఖీలు చేశాం. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి ప్రతి కోచ్‌ను తనిఖీ చేశాం. దీనికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. తనిఖీలు చేపట్టిన అనంతరం రైలు వెళ్లేందుకు అనుమతిచ్చాం” అని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుశీల్ కుమార్ తెలిపారు