సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలతో డిఫర్ చేస్తూ బొత్స సత్య నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ 1998 అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే విషయమై సీఎం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం ఇమేజ్ ను ఒక్కసారిగా పెంచేయడంతో మంత్రులు కూడా మంచి మైలేజీని అందుకున్నారు. పొలిటికల్ గా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఎవ్వరూ వ్యతిరేకించలేని విధంగా ఉంది. దీంతో అన్ని చోట్లా ఇన్నాళ్లకు వారికి సరైన న్యాయం జరిగిందని కొందరు అంటుండగా, ఇంకొందరు మాత్రం ఆలస్యం అయిన నిర్ణయం కారణంగా అభ్యర్థుల జీవితాలు డైలమాలో పడ్డాయని కూడా అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ముఖ్యమంత్రి చూపిన కరుణ కారణంగా వీరందరికీ పోస్టింగులు దక్కాయి. త్వరలోనే వీరు ఉద్యోగ బాధ్యతలు అందుకోనున్నారు.
ఇదే సమయంలో సంబంధిత అభ్యర్థులు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ను వీళ్లు మొన్న కలిసి ఎంతో బాధ్యతగా కృతజ్ఞతలు చెప్పి వచ్చారు. ఆయన కూడా వీరిని సాదరంగా స్వాగతించి, అభినందించి, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోడమే మీరు ముఖ్యమంత్రికి చెల్లించే కృతజ్ఞత అని చెప్పి పంపారు. కానీ ఇదే విషయంలో బొత్స సత్యనారాయణ (విద్యా శాఖ మంత్రి) భిన్నంగా స్పందించారు. మీకు వయసు పెరిగి పోయింది. మీరు చదువు చెప్పడం మరిచిపోయారు. మీ వయస్సు 45 నుంచి 50 ఏళ్లు ఉంటుంది. ఈ వయస్సులో మీరు చదువులు చెప్పగలరా అన్నదే నా భయమంతా అని ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేశారు. మీకు మళ్లీ శిక్షణ ఇచ్చాక తరగతుల బోధనకు పంపాలి అని కూడా వ్యాఖ్యానించారు. ఇవే ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. ముఖ్యమంత్రి నిర్ణయాలను తాను అడ్డుకోలేనని చెబుతూ, వీరి విషయమై మంత్రి కాస్త ఆసక్తి రేపే వ్యాఖ్యలు చేస్తుండడడంతో సర్వత్రా బొత్స ఇప్పుడు చర్చకు తావిస్తున్నారు.