మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ కీలక నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టకపోవడం మేరకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులేసినట్లు తెలుస్తోంది.
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో శిబిరం నిర్వహించిన షిండే గురువారం మధ్యాహ్నం ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్ళిన షిండే ఆయనతో కలిసి గురువారం గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం తమకు ఉందని వారు గవర్నర్ కు తెలిపారు.
గవర్నర్ నుంచి ఆమోదం తీసుకున్న తర్వాత షిండేతో కలిసి ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫడ్నవీస్ సంచలన ప్రకటన చేశారు. షిండే నేతృత్వంలోనే శివసేన ప్రభుత్వం కొలువుదీరనున్నదని ఆయన ప్రకటించారు. బాల్ ఠాక్రే ఆశయాలకు ఉద్దవ్ తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. సావర్కర్ వ్యతిరేకులతో ఉద్దవ్ చేతులు కలిపారని మండిపడ్డారు. కాగా తాము షిండే ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో చేయబోమని ప్రకటించారు ఫడ్నవీస్.