పట్టుదల, శ్రమ, అంకిత భావం ఉండాలే గానీ.. ఎవరైనా, ఏదైనా సాధించవచ్చు. అందుకు వయస్సుతో పనిలేదు. చిన్నవాళ్లయినా, పెద్దలైనా ఏదైనా చేయవచ్చు. సరిగ్గా ఇలా అనుకున్నాడు కాబట్టే ఆ బాలుడు ఈ వయస్సులోనే ఏకంగా డాక్టరేట్ పట్టా పొందాడు. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజ్ అతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
సూరత్‌లోని వెసు అనే ప్రాంతానికి చెందిన శమక్ అగర్వాల్ కు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ప్రాణం.. గత 9 ఏళ్ల నుంచి అంటే అతనికి 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే అతను పెయింటింగ్స్, డ్రాయింగ్స్ పై ఆసక్తి చూపాడు. అయితే అతను చదివే స్కూల్లో ఆర్ట్స్ నేర్పించలేదు. అందుకని తల్లిదండ్రులు అతన్ని వేరే స్కూల్‌కు మార్చారు. అప్పటి నుంచి శమక్ ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్, డ్రాయింగ్స్, స్కెచెస్ వేశాడు. దీంతో అతన్ని పలు రివార్డులు, అవార్డులు, బహుమతులు వరించాయి.
ఆర్ట్స్ లో ప్రతిభ చూపిస్తున్నందుకు గాను శమక్కు ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ తోపాటు యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో చోటు లభించింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ ఆ బాలుడికి ఆర్ట్స్ లో డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. దీంతో 16 ఏళ్లకే డాక్టరేట్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఇక శమక్కు బాల్ రత్న అవార్డు 2021 కూడా లభించింది. అలాగే అత్యంత వేగంగా డ్రాయింగ్, స్కెచెస్ వేయడంలోనూ శమక్ రికార్డులను కలిగి ఉన్నాడు. అతను సైన్స్ స్టూడెంట్ అయినప్పటికీ ఆర్ట్స్ లో ఈ విధంగా ప్రతిభ చూపిస్తుండడం పట్ల అందరూ అతన్ని అభినందిస్తున్నారు.